South Africa: మమ్మల్ని విలన్లలా ఎందుకు చూస్తున్నారు?.. ప్రపంచ దేశాలపై దక్షిణాఫ్రికా మండిపాటు

South Africa Fires on World Countries for flight ban
  • ప్రపంచానికి తెలియజెప్పినందుకు మమ్మల్ని ప్రశంసించాలి
  • ఇది అనాలోచిత ప్రతిస్పందన
  • కొత్త వేరియంట్‌పై సరైన సమాచారం లేకుండానే నిషేధం ఎలా విధిస్తారు
  • జన్యుక్రమ పరిశీలనల వల్లే కొత్త వేరియంట్ వెలుగులోకి
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ (ఆందోళనకర రకం)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇలా నిషేధం విధించడాన్ని సౌతాఫ్రికా తీవ్రంగా తప్పుబట్టింది. తమను విలన్లలా చూడడం మానుకోవాలని ప్రపంచ దేశాలకు హితవు పలికింది.

ఇది ‘అనాలోచిత ప్రతిస్పందన’ అని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ (సామా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విధానాలను విడిచిపెట్టాలని కోరింది. ఒమిక్రాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉంటుందన్న దానిపై ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని సామా చైర్ పర్సన్ ఏంజెలిక్ కోయెట్జీ పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌పై తగినంత సమాచారం లేకుండానే 18 దేశాలు నిషేధం విధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి వేరియంట్ గురించి ప్రపంచానికి తెలియజెప్పినందుకు తమను ప్రశంసించాల్సింది పోయి తమ విమానాలను నిషేధించడం ఎంత మాత్రమూ సరికాదన్నారు.

తమ శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉండి, విస్తృతంగా జన్యుక్రమ పరిశీలన జరపడం వల్లే ఈ వేరియంట్ వెలుగు చూసిందని, లేదంటే ఐరోపా దేశాలు ఒమిక్రాన్‌ను గుర్తించి ఉండకపోవచ్చన్నారు. నిజానికి ఏ దేశమైనా తమ ప్రజలను కాపాడుకోవాలంటే వారిని అప్రమత్తం చేయాలని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తప్ప ఇలాంటి ప్రతిస్పందన సరికాదని కోయెట్జీ పేర్కొన్నారు.
South Africa
Omicran
COVID19
New Variant
WHO

More Telugu News