Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్... అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై పునఃసమీక్షించనున్న కేంద్రం

Centre to review international flights revival in the wake of Omicron corona variant
  • డిసెంబరు 15 నుంచి విమానాలు తిప్పుతామని ఇటీవల ప్రకటన
  • అంతలోనే ఒమిక్రాన్ భయాందోళనలు
  • అత్యవసర సమావేశం నిర్వహించిన కేంద్ర హోంశాఖ
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ లేఖ
డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చేట్టు కనిపించడంలేదు. అందుకు కారణం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529). ఒమిక్రాన్ వ్యాప్తి భయంతో అనేక దేశాలు ప్రయాణ ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి. బ్రిటన్, ఇజ్రాయెల్, సింగపూర్, ఇటలీ వంటి దేశాలు దక్షిణాఫ్రికా, బోట్సువానా తదితర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడం ఎంతో ముప్పుతో కూడుకున్న వ్యవహారం అని కేంద్రం ఆందోళన చెందుతోంది.

అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరింతగా పునఃసమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ మధ్యాహ్నం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ప్రధాని ముఖ్య శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, వైద్య ఆరోగ్య, పౌర విమానయాన శాఖల ఉన్నతాధికారులు, ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వైనాన్ని ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్ ముప్పు ఎదుర్కొంటున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఓ ప్రణాళిక రూపొందిస్తున్నామని, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపై నిఘా, కరోనా పరీక్షల విధానం వంటి అంశాలను సమీక్షించాలని కేంద్రం నిర్ణయించినట్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అటు, ఒమిక్రాన్ ప్రభావం నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని, విదేశాల నుంచి వచ్చే వ్యక్తులను గుర్తించడంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను ఎక్కడిక్కడ కట్టడి చేయాలని, కంటైన్మెంట్ విధానం పకడ్బందీగా అమలు చేయాలని, వ్యాక్సినేషన్ ను ఉద్ధృతం చేయాలని స్పష్టం చేశారు.
Omicron
International Flights
Centre
Review
India

More Telugu News