హైద‌రాబాద్‌లో 44 మంది స్వ‌లింగ సంప‌ర్కుల అరెస్టు

28-11-2021 Sun 13:58
  • స్వ‌లింగ సంప‌ర్కులంతా క‌లిసి వాట్స‌ప్ గ్రూపు ఏర్పాటు
  • కూక‌ట్‌ప‌ల్లిలో పార్టీలు చేసుకుంటోన్న వైనం
  • మ‌ద్యం, హుక్కా తాగి నృత్యాలు
  • స్థానికుల‌కు తీవ్ర ఇబ్బందులు
police arrest 44 homosexual people
హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో పోలీసులు భారీగా స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అరెస్టు చేశారు. కూక‌ట్‌ప‌ల్లిలోని వివేక్‌న‌గ‌ర్‌లోని ఓ ఇంట్లో గ‌త రాత్రి స్వ‌లింగ సంప‌ర్కులు పార్టీ చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి సోదాలు నిర్వ‌హించారు. దీంతో చాలా మంది స్వ‌లింగ సంప‌ర్కులు అందులో మ‌ద్యం, హుక్కా తాగి నృత్యాలు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

దీంతో మొత్తం 44 మంది స్వ‌లింగ సంప‌ర్కుల‌ను పోలీసులు విచారించారు. స్వ‌లింగ సంప‌ర్కులు ప్ర‌తి శ‌నివారం హైద‌రాబాద్‌లో పార్టీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తేల్చారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతోనే వివేక్‌న‌గ‌ర్‌లో వారిని ప‌ట్టుకున్న‌ట్లు వివ‌రించారు.

ఇటువంటి పార్టీలు నిర్వహిస్తోన్న ఇమ్రాన్ ద‌యాల్ అనే వ్య‌క్తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. స్వ‌లింగ సంప‌ర్కులంతా క‌లిసి వాట్స‌ప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వారంతా రెండేళ్లుగా వారంతాల్లో పార్టీలు చేసుకుంటున్న‌ట్లు తేల్చారు. పార్టీలు చేసుకోవ‌డానికి ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకోవ‌డంతో వివేక్‌న‌గ‌ర్‌లో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.