థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌.. స‌ల్మాన్ ఖాన్ మండిపాటు.. వీడియో ఇదిగో

28-11-2021 Sun 13:42
  • 'అంతిమ్' సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో ఘ‌ట‌న‌
  • బాణ‌సంచాను అనుమ‌తించొద్ద‌ని థియేట‌ర్ల‌కు స‌ల్మాన్ విజ్ఞ‌ప్తి
  • ప్రాణాల‌కు ముప్పు ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌
Salman Khans Request To Fans Bursting Crackers Inside A Theatre
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా విడుద‌లైతే అభిమానులకు పండుగే. అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతాయి. ఒక్కోసారి వారు రెచ్చిపోయి హ‌ద్దులు మీరుతుంటారు. అటువంటి ఘ‌ట‌నే అంతిమ్ సినిమా ప్ర‌ద‌ర్శిస్తోన్న ఓ సినిమా థియేట‌ర్‌లో చోటు చేసుకుంది. థియేట‌ర్‌లో వంద‌లాది మంది కూర్చొని ఉండ‌గా అభిమానులు బాణ‌సంచా కాల్చుతూ పండుగ చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన స‌ల్మాన్ ఖాన్ వారిపై మండిప‌డ్డాడు. అభిమానుల‌తో పాటు థియేట‌ర్ యాజ‌మాన్యానికి ఓ విజ్ఞ‌ప్తి చేశాడు. థియేట‌ర్‌లో బాణ‌సంచా పేల్చే వారి ప్రాణాలే కాకుండా అందులో ఉండే ప్రేక్ష‌కుల ప్రాణాల‌కూ ముప్పు ఉంటుంద‌ని ఆయ‌న త‌న అభిమానుల‌కు చెప్పాడు.

అలాగే, థియేట‌ర్ల‌లోకి బాణ‌సంచా తీసుకురాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సెక్యూరిటీ సిబ్బందితో చెక్ చేయించాల‌ని ఆయ‌న సినిమా హాళ్ల య‌జ‌మానుల‌ను కోరాడు. ప్ర‌మాదాన్ని కొని తెచ్చుకునే ప‌నులు చేయ‌కుండా సినిమాను ఎంజాయ్ చేయాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశాడు.

కాగా, సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'అంతిమ్‌: ది ఫైనల్ ట్రూత్' సినిమా ఇటీవ‌లే విడులైంది. ఈ సినిమాకు మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ పోలీసు అధికారిగా న‌టించాడు. ఈ సినిమా విడుద‌లై థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.