International Flights: డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Center set to allow international flights from next month
  • కరోనా ప్రభావంతో నిలిచిన అంతర్జాతీయ విమానాలు
  • దేశంలో తగ్గిన కరోనా ప్రభావం
  • కేంద్రం ఆంక్షల సడలింపు
  • అంతర్జాతీయ విమాన సర్వీసులకు మోక్షం
  • ఆందోళనకు గురిచేస్తున్న కొత్త వేరియంట్
కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగానే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా రోజువారీ కేసులు 10 వేలకు దిగువున నమోదువుతుండడంతో కేంద్రం ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు పచ్చజెండా ఊపనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సమీక్ష జరిపామని, భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు, విదేశాల నుంచి భారత్ కు వచ్చే విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వనున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోనూ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతోనూ, విదేశీ వ్యవహారాల శాఖతోనూ ఈ అంశాన్ని చర్చించామని... గత కొంతకాలంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు సానుకూల స్పందన లభించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే, కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చే విషయంపై అనిశ్చితి ఏర్పడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి సమీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే... బ్రిటన్, ఇజ్రాయెల్, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా సహా ఆరు దేశాల నుంచి విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాలు తిప్పడం అంటే కోరి ముప్పును కొనితెచ్చుకున్నట్టే అవుతుందని భావిస్తున్నారు.
International Flights
India
Corona Virus
New Variant

More Telugu News