అసెంబ్లీలో త‌నపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను: నారా భువనేశ్వరి

26-11-2021 Fri 12:32
  • నిరసన వ్యక్తం చేసిన వారందరికీ  ధన్యవాదాలు
  • చిన్నతనం నుంచి మ‌మ్మ‌ల్ని అమ్మ, నాన్న విలువలతో పెంచారు
  • గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు
  • ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలి
bhuvaneswari on comments against her
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో త‌నపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి భార్య నారా భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఆమె ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌నకు జరిగిన అవమానాన్ని కొంద‌రు వారి తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి త‌నకు అండగా నిలబడ్డార‌ని ఆమె చెప్పారు.

త‌న‌ జీవితంలో వారి ప్రేమ‌ను మర్చిపోలేనని పేర్కొన్నారు. త‌మ‌ను చిన్నతనం నుంచి అమ్మ, నాన్న విలువలతో పెంచార‌ని భువ‌నేశ్వ‌రి చెప్పారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని భువ‌నేశ్వ‌రి అన్నారు. త‌న‌కు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు.