ఇడుగో 'శేఖర్'... రాజశేఖర్ కొత్త చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్

25-11-2021 Thu 17:39
  • రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో 'శేఖర్'
  • పిక్ తో పాటు వీడియో పంచుకున్న చిత్రబృందం
  • శేఖర్ చిత్రానికి సహ నిర్మాతలుగా శివాని, శివాత్మిక
Sekhar glimpse released
రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ గ్లింప్స్ రిలీజైంది. బుల్లెట్ పై చేతులు కట్టుకుని కూర్చుని ఉన్న రాజశేఖర్ పిక్ తో పాటు వీడియోను కూడా చిత్ర బృందం ఈ సాయంత్రం విడుదల చేసింది.

అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో గ్లింప్స్‌ మొదలవుతుంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా... ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 'శేఖర్'గా రాజశేఖర్‌ ఎంట్రీ ఇస్తాడు.  'వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?' అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే... స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ ను స్క్రీన్ మీద చూడొచ్చు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.