కరోనా బారిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. ఆరోగ్యం విషమం.. అపస్మారకస్థితిలో కుమారుడు!

25-11-2021 Thu 06:30
  • నాలుగు రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్న శివశంకర్ భార్య
  • 800కుపైగా సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ మాస్టర్
Shiva Shankar Master Is Critical condition
కొవిడ్ బారినపడి గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు చెప్పారు. శివశంకర్ భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. కుమారుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు.

భార్య మాత్రం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా పదికిపైగా భాషల్లో పనిచేశారు. 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో మగధీర సినిమాలోని ‘ధీర.. ధీర..’ పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు తమిళనాడు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జ‌డ్జ్‌గా వ్యవహరించారు.