డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమా స్ట్రీమింగ్... జీ5 ఓటీటీలో కొత్త ఒరవడి

24-11-2021 Wed 17:47
  • ఇటీవల థియేటర్లలో విడుదలైన రిపబ్లిక్
  • దేవ్ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా చిత్రం
  • నవంబరు 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
  • డైరెక్టర్ కామెంటరీతో స్ట్రీమింగ్
Sai Dharam Tej audio message ahead of Republic movie OTT streaming
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా నవంబరు 26న జీ5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అది కూడా దర్శకుడు దేవ్ కట్టా కామెంటరీతో! వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే 'జీ5' ఓటీటీ వేదిక... డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.