రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రానున్న సాయి ధరమ్ తేజ్!

24-11-2021 Wed 14:40
  • ‘రిపబ్లిక్’ మూవీ డిజిటల్ ప్రమోషన్
  • జీ5లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్
  • తన యాక్సిడెంట్ పై వివరాలు వెల్లడించే అవకాశం
Sai Dharam Tej To Appear Before Media For the First Time After Accident
రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారిగా మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై తేజ్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. అతడు తొలుత మెడికవర్ ఆసుపత్రిలో, ఆపై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కాలర్ బోన్ విరగడంతో అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో వచ్చే ఏడాది వరకు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఈ మెగా వారసుడు వాయిదా వేశాడు.

అయితే, ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న ‘రిపబ్లిక్’ సినిమాకు సంబంధించి ‘డిజిటల్’ ప్రమోషన్ ను నిర్వహించేందుకు సాయి ధరమ్ తేజ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎల్లుండి (నవంబర్ 26) నుంచి సినిమాను జీ5లో విడుదల చేయనుండడంతో.. ఆ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తాడని చెబుతున్నారు.

అయితే, మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన ప్రమాదంపై మాట్లాడుతాడని తెలుస్తోంది. యాక్సిడెంట్ ఎలా జరిగింది? బైక్ ఎలా స్కిడ్ అయింది? వంటి వివరాలను వెల్లడిస్తాడని చెబుతున్నారు.