స్పృహలోకి వచ్చిన కైకాల సత్యనారాయణ... ఫోన్ చేసిన చిరంజీవి

21-11-2021 Sun 16:59
  • తీవ్ర అస్వస్థత‌తో ఆసుపత్రిపాలైన కైకాల
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ట్రాకియాస్టోమీ కారణంగా మాట్లాడలేకపోతున్న కైకాల
  • కోలుకుంటారన్న నమ్మకం కలుగుతోందన్న చిరంజీవి
Chiranjeevi talks to Kaikala Satyanarayana
తీవ్ర అస్వస్థతకు గురైన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కైకాల ఆరోగ్యంపై టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల సత్యనారాయణకు ఫోన్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలిసిందని, దాంతో క్రిటికల్ కేర్ విభాగం డాక్టర్ సుబ్బారెడ్డి సాయంతో ఆయనను ఫోన్ ద్వారా పలకరించినట్టు చిరంజీవి వెల్లడించారు.

"ట్రాకియాస్టోమీ కారణంగా సత్యనారాయణ నేరుగా మాట్లాడలేకపోయారు. అయితే త్వరగా కోలుకుని ఇంటికి రావాలని, మనందరం ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అన్నప్పుడు బొటనవేలు పైకెత్తి థమ్సప్ సైగ చేశాడని డాక్టర్ సుబ్బారెడ్డి చెప్పారు. సత్యనారాయణ త్వరగా కోలుకుంటారన్న నమ్మకం కలుగుతోంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి తెలిపారు.. ఆయనతో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.