కెరీర్ లో తొలి టెస్టు ఆడుతూ ఆసుపత్రిపాలైన వెస్టిండీస్ క్రికెటర్

21-11-2021 Sun 14:21
  • శ్రీలంక, వెస్టిండీస్ మధ్య నేటి నుంచి తొలి టెస్టు
  • గాలే వేదికగా మ్యాచ్
  • షార్ట్ లో ఫీల్డింగ్ చేసిన జెరెమీ సొలజానో
  • బలమైన షాట్ కొట్టిన శ్రీలంక సారథి కరుణరత్నే
  • కుప్పకూలిపోయిన సొలజానో
West Indies debutante Jereme Solozano hospitalized
శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య గాలేలో నేడు తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ యువ ఆటగాడు జెరెమీ సొలజానో అరంగేట్రం చేశాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలి సెషన్ లో బ్యాటింగ్ చేస్తుండగా, సొలజానో వికెట్లకు దగ్గరగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొట్టిన బలమైన షాట్ సొలజానో నుదుటిపై బలంగా తాకింది.

ఆ షాట్ పవర్ కు సొలజానో హెల్మెట్ కూడా కదిలిపోయింది. బాధతో విలవిల్లాడిన సొలజానో కిందపడిపోయాడు. దాంతో అతడిని స్ట్రెచర్ పై మైదానం వెలుపలికి తీసుకెళ్లి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్కానింగ్ లో గాయం తీవ్రత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ టెస్టులో సొలజానో మళ్లీ మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. ఆ యువ ఆటగాడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు వెస్టిండీస్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.