Kerala: ప్రేమిస్తే లైంగిక సంబంధానికి అంగీకరించినట్టు కాదు: కేరళ హైకోర్టు

  • కేరళలోని ఓ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
  • ప్రేమిస్తున్నంత మాత్రాన లైంగిక సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు భావించకూడదన్న ధర్మాసనం
  • లొంగుబాటుకు, అంగీకారానికి మధ్య తేడా తెలుసుకోవాలని సూచన
  • ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన న్యాయస్థానం
love doesnt count as consent for sex said Kerala high court

ప్రేమిస్తున్నంత మాత్రాన అన్నింటికీ అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే అతడితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదని స్పష్టం చేసింది. ఆమె ప్రేమిస్తుంది కాబట్టి లైంగిక సంబంధానికి కూడా అంగీకరించినట్టు కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలా భావించి బలవంతంగా సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్, అత్యాచారం కిందికే వస్తుందని జస్టిస్ ఆర్. నారాయణ పిషరది నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేక ఆమె అంగీకరించి లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకరిస్తున్నట్టు కాదని, అంగీకారానికి, లొంగుబాటుకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని పేర్కొంది.

శ్యాం శివన్ (26) అనే యువకుడు తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె నగలు విక్రయించి గోవా తీసుకెళ్లి అక్కడ మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో వచ్చేందుకు అంగీకరించకుంటే ఆమె ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె అతడితో వెళ్లింది.

ఈ ఘటనపై కేసు నమోదు కాగా, ఆమె తనతో వచ్చేందుకు కానీ, ఆ తర్వాత జరిగిన దానికి గానీ ఆమె ఎక్కడా ప్రతిఘటించలేదని, ఆమె అంగీకారంతోనే అంతా జరిగిందని నిందితుడు కోర్టుకు తెలిపాడు. అయితే, అతడి వాదనను సమర్థించని ట్రయల్ కోర్టు అత్యాచార నేరం కింద అతడికి శిక్ష విధించింది. దీంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా అక్కడా అతడికి ఎదురుదెబ్బే తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే, బాధితురాలి వయసు విషయంలో సరైన నిర్ధారణ లేకపోవడంతో పోక్సో చట్టం కింద అతడిపై నమోదైన కేసును మాత్రం కోర్టు కొట్టివేసింది.

More Telugu News