చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం నన్ను కలచివేసింది: వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

21-11-2021 Sun 07:19
  • చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి అలాంటి చర్చను నిలువరించి ఉండాల్సింది
  • చంద్రబాబు హయాంలోనూ మహిళలపై దాడులు
  • బాబు ఏడవడం చూసి తనకు చాలా సంతోషంగా అనిపించిందన్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి
ummareddy venkateswarlu said Charndrababu Naidu Tears touched him
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కంటతడి పెట్టుకోవడం తనను కలచివేసిందని వైసీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. నిన్న గుంటూరులోని పొన్నూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో అలాంటి చర్చ జరుగుతున్నప్పుడు చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి దానిని నివారించి ఉండాల్సిందన్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ హయాంలోనూ మహిళలపై అనేక దాడులు జరిగాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాటిని ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించారు.

కాగా, కాకినాడలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏడవడం చూసి తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు. గుజరాత్‌లో దొరికిన హెరాయిన్‌కు, కాకినాడకు లింకు పెట్టి తనకు సంబంధం ఉందని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని, అప్పట్లో తన కుటుంబం ఎంతగానో బాధపడిందని ద్వారంపూడి అన్నారు.