ఆ మాట నిజంగా అనుంటే ఇప్పుడు మా బతుకులు ఎలా ఉండేవో?: మంత్రి పేర్ని నాని

20-11-2021 Sat 14:34
  • నారా భువనేశ్వరిని అసెంబ్లీలో దూషించారన్న చంద్రబాబు
  • నందమూరి కుటుంబంలో తీవ్ర ఆగ్రహావేశాలు
  • వైసీపీ నేతలపై మండిపడిన బాలకృష్ణ తదితరులు
  • బాలకృష్ణ నిజంగా అమాయకుడన్న పేర్ని నాని
  • బాబు చేతిలో ఇంకా మోసపోతున్నారని వ్యాఖ్య  
Perni Nani counters Nandamuri family comments
అసెంబ్లీలో నారా భువనేశ్వరిని దూషించారన్న అంశంపై నందమూరి కుటుంబం తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నందమూరి కుటుంబం ఇప్పటికీ చంద్రబాబు చేతిలో మోసపోతూనే ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పింది నిజమే అని నమ్మిన బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నందమూరి కుటుంబసభ్యులు బుర్రల్లోకి చంద్రబాబు విషం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.

"చంద్రబాబు మైక్ కట్ చేసిన వెంటనే సెల్ ఫోన్ లో వీడియో ఎలా రికార్డు చేయగలిగారు? ఇదంతా ముందే వేసుకున్న ప్రణాళిక. బాలకృష్ణ నిజంగానే ఒక అమాయక చక్రవర్తి. చంద్రబాబు చెప్పింది గుడ్డిగా నమ్మేస్తారు. మా ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉన్నారు. ఇదెంతో సున్నితమైన అంశం. యథాలాపంగా ఎలా అనేస్తాము? ఒకవేళ మేం ఏదైనా అనుంటే ఇప్పుడు మా బతుకులు ఇలా ఉండేవి కావు.

మాకు బాధ కలిగే విషయం ఏంటంటే... ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి తీసుకురావడమే. భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదు. నిన్న ఆమె సోదరి పురందేశ్వరి కూడా తొందరపడి ట్వీట్ చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? చివర్లో బాబు నైజం తెలుసుకుని బయటికి వచ్చింది మీరు కాదా? చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోతారా? 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎంతలా దిగజారతాడనేదానికి నిన్న జరిగిన సంఘటనలే నిదర్శనం. నిన్న ఏపీ రాజకీయాల్లో నిజంగా బ్లాక్ డే!" అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.