కరోనా టీకా విషయంలో అమెరికా కీలక నిర్ణయం.. 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు

20-11-2021 Sat 08:25
  • శీతాకాలం నేపథ్యంలో కరోనా కేసులు పెరిగే చాన్స్
  • ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోట్లాదిమందికి లబ్ధి
  • గత టీకాతో సంబంధం లేకుండా ఏ టీకా అయినా తీసుకోవచ్చన్న ఎఫ్‌డీఏ
America allow to booster dose who crossed 18 years
కరోనా టీకాల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తంటాలు పడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది.

ఇప్పటి వరకు 65 ఏళ్లు పైబడిన వారికి, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అమెరికా తాజా నిర్ణయంతో కోట్లాదిమందికి లబ్ధి చేకూరనుంది. శీతాకాలంలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయోగం కానుందని మోడెర్నా ఈఈవో స్టెఫాన్ బాన్సెల్ పేర్కొన్నారు.

రెండో డోసు తీసుకుని ఆరు నెలల దాటిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు తీసుకోవచ్చు. గతంలో తీసుకున్న టీకాతో సంబంధం లేకుండా బూస్టర్ డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, సింగిల్ డోసు టీకా అయిన జాన్సన్ అండ్ జాన్సన్ షాట్ తీసుకున్న వారు కూడా బూస్టర్ డోసు తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 19.5 కోట్ల మంది రెండు డోసులు తీసుకోగా, మూడు కోట్ల మంది మూడో డోసు కూడా తీసుకున్నారు.