Telangana: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనం పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు

  • గతంలో గౌరవ వేతనాల పెంపు ఉత్తర్వులు
  • ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • రాష్ట్రంలో కోడ్ అమలు
  • పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ తాజా ఉత్తర్వులు
Telangana govt withdraws salary hike decision

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపుపై అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు సమాచారం.

జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థల మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలు... డిప్యూటీ మేయర్ల వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.32,500కు పెంచుతూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

50 వేల జనాభా దాటిన మున్సిపాలిటీల చైర్ పర్సన్లకు రూ.15 వేల నుంచి రూ.19,500... డిప్యూటీ చైర్ పర్సన్లకు రూ.7,500 నుంచి రూ.9,750... కౌన్సిలర్లకు రూ.3,500 నుంచి రూ.4,550 పెంచుతున్నట్టు నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

50 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల చైర్ పర్సన్లకు రూ.12 వేల నుంచి రూ.15,600... డిప్యూటీ చైర్ పర్సన్ల వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500... కౌన్సిలర్లకు రూ.2,500 నుంచి రూ.3,250 పెంచారు.

అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడా పెంపు అమలుకు బ్రేక్ పడింది. ఈసీ నిర్ణయం కోసం తెలంగాణ ప్రభుత్వం వేచిచూస్తోంది.

More Telugu News