తెలుగు దర్శకులను లైన్లో పెట్టేస్తున్న తమిళ హీరోలు!

19-11-2021 Fri 19:11
  • టాలీవుడ్ పై తమిళ హీరోల ఆసక్తి
  • శేఖర్ కమ్ములతో ధనుశ్
  • వంశీ పైడిపల్లితో విజయ్
  • అనుదీప్ తో శివ కార్తికేయన్
  • అదే బాటలో మరికొందరు  
Tamil directors are intrested in Telugu movies
రజనీకాంత్ .. కమలహాసన్ నుంచి కోలీవుడ్ హీరోలు తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. విక్రమ్ .. సూర్య .. కార్తి .. విశాల్ .. ధనుశ్ వీళ్లంతా కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవలే ఆ జాబితాలో శివ కార్తికేయన్ కూడా చేరిపోయాడు. తమ సినిమాల రిలీజ్ సమయంలో హైదరాబాద్ లో ఈవెంట్లు సైతం పెట్టేస్తున్నారు.

ఇక కోలీవుడ్ హీరోలంతా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం కోసం, నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. తెలుగు దర్శక నిర్మాతలను లైన్లో పెట్టేసి కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసేస్తున్నారు. ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. సూర్య .. కార్తి కూడా కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలతో టచ్ లో ఉన్నారు. ఇక శివ కార్తికేయ కూడా 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ మళ్లీ తమిళంలో రిలీజ్ అవుతాయన్న మాట. తెలుగులో మార్కెట్ కోసం తమిళ హీరోలు గట్టిగానే ట్రై చేస్తున్నారు.