Nusrat Jahan: సినీ నటి, టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్-నిఖిల్ జైన్ వివాహంపై కోల్‌కతా కోర్టు కీలక తీర్పు

  • జూన్ 2019లో టర్కీలో వివాహం
  • కోల్‌కతాలో రిసెప్షన్
  • వివాహాన్ని ఇండియాలో రిజిస్టర్ చేయించేందుకు నస్రత్ విముఖత
  • అదే సమయంలో నటుడితో ప్రేమాయణం వార్తలు
Nusrat Jahan and Nikhil Jains Wedding Not Legally Valid said Court

ప్రముఖ సినీ నటి, టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్-వ్యాపారవేత్త నిఖిల్ జైన్ వివాహంపై కోల్‌కతా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి వివాహానికి ‘చట్టబద్ధత’ లేదని తేల్చి చెప్పింది. 19 జూన్ 2019లో టర్కీలోని బోడ్రమ్‌లో నస్రత్-నిఖిల్ మధ్య వివాహం జరిగింది. అయితే, ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య జరిగిన వివాహం చట్టబద్ధం కాదని ప్రకటించాలంటూ నిఖిల్ జైన్ అలీపూర్ కోర్టును ఆశ్రయించారు.

టర్కీలో జరిగిన తమ వివాహం భారత్‌లో చెల్లుబాటు కాదని నస్రత్ గతంలోనే ప్రకటించారు. తాజాగా, నిఖిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. హిందూ, ముస్లిం అయిన వీరిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోలేదని, కాబట్టి వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, టర్కీలో వివాహం చేసుకున్న వీరిద్దరూ కోల్‌కతాలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.

తమ వివాహాన్ని ఇండియాలోనూ రిజిస్టర్ చేయించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా నస్రత్ అంగీకరించలేదని గతంలో నిఖిల్ ఆరోపించారు. అదే సమయంలో నస్రత్‌కు నటుడు, మోడల్ యశ్‌దాస్ గుప్తాతో అఫైర్ ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలోనే తమ వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిఖిల్ నిర్ణయించి కోర్టును ఆశ్రయించారు.

More Telugu News