India: పీవోకేని ఖాళీ చేయాలంటూ పాకిస్థాన్​ కు భారత్​ వార్నింగ్!

India Warns Pakistan To Vacate Pak Occupied Areas In Kashmir
  • ఐరాస భద్రతా మండలి చర్చలో హెచ్చరిక
  • కశ్మీర్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమేనని కామెంట్
  • ఐరాస వేదికలను పాక్ దుర్వినియోగం చేస్తోందని మండిపాటు
  • భారత్ తరఫున చర్చలో పాల్గొన్న దౌత్యవేత్త కాజల్ భట్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఐరాస వేదికలను పాకిస్థాన్ దుర్వినియోగపరుస్తోందని, తమ దేశంపై అబద్ధపు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘దౌత్య విధానాల ద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణ’ అనే అంశంపై చర్చ సందర్భంగా భారత్ తరఫున ఐరాసలో భారత శాశ్వత కౌన్సిలర్, న్యాయ సలహాదారు డాక్టర్ కాజల్ భట్ చర్చలో పాల్గొన్నారు.

ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వారికి శిక్షణనిస్తోందన్న విషయం బహిరంగ వాస్తవమని, ప్రపంచం మొత్తానికీ అది తెలుసని అన్నారు. పాకిస్థాన్ సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే, సీమాంతర ఉగ్రవాదంపై అంతే కటువుగా ఉంటామని తేల్చి చెప్పారు. పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని, దాని నుంచి దృష్టి మరల్చేందుకే భారత్ పై ఆ దేశం విషం కక్కుతోందని మండిపడ్డారు.

జమ్మూకశ్మీర్ పై పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. అది ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లోని భూభాగమేనని కాజల్ భట్ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ముందు ఖాళీ చేయాలని, ఆ దేశం ఆక్రమించిన కశ్మీర్ లోని అన్ని ప్రాంతాలనూ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. పాకిస్థాన్ తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలోనే జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.
India
UN
UNSC
Pakistan
PoK
Kajal Bhat

More Telugu News