పునీత్​ కు భారతరత్న ఇవ్వాలి.. సంస్మరణ సభలో శరత్ కుమార్ డిమాండ్​

17-11-2021 Wed 12:09
  • బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో పునీత్ సంస్మరణ సభ
  • హాజరైన ప్రముఖ నటుడు శరత్ కుమార్
  • ‘రాజకుమార’ సినిమా 100 రోజుల వేడుక అదే గ్రౌండ్లో
  • పునీత్ శ్రద్ధాంజలి అక్కడే జరగడం విచారకరం
  • తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు
Sharath Kumar Became Emotional In Puneet Remembrance
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరత్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే గ్రౌండ్స్ లో పునీత్ ‘రాజకుమార’ సినిమా 100 రోజుల వేడుక జరిగిందని, కానీ, అదే గ్రౌండ్స్ లో ఇప్పుడు ఆయన శ్రద్ధాంజలి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా. కానీ పునీత్ సంస్మరణ సభకు నేను రావాల్సి వచ్చింది. ఆ దేవుడు పునీత్ కు బదులు నన్ను తీసుకుపోయినా బాగుండేది’’ అంటూ శరత్ కుమార్ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు 67 ఏళ్లు నిండాయని, వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. పునీత్ అందరినీ వదిలి వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదన్నారు.

జేమ్స్ అనే సినిమా షూటింగ్ సందర్భంగా పునీత్ స్వయంగా వంట చేసి తనకు వడ్డించాడని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన సినిమా అరంగేట్రం కర్ణాటక నుంచే మొదలైందని, తన తొలి పారితోషికాన్ని ఇక్కడే అందుకున్నానని అన్నారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కు ఎప్పుడైనా సాయం చేసేందుకు సిద్ధమన్నారు.

పునీత్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రచారం కోసమే మంచి చేసినట్టు నటిస్తున్నారని, కానీ, ఏం ఆశించకుండా, రాజకీయాల్లోకి రాకుండానే పునీత్ ఎన్నో మంచి పనులు చేశాడని గుర్తు చేశారు. భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని అన్నారు. అందరూ అంటున్నట్టు ఆయనకు మరణానంతర పద్మశ్రీ ఇస్తే మంచిదేనని, కానీ, అంతకన్నా భారతరత్నకు అతడు ఎక్కువ అర్హుడని చెప్పుకొచ్చారు.