Sonu Sood: అమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన సోనూసూద్.. ఇదిగో వీడియో

  • కేబీసీలో అమ్మను గుర్తు చేసుకుని భావోద్వేగం
  • వాటిని చదివితే అమ్మ పక్కన ఉన్నట్టే ఉంటుందన్న సోనూ
  • ఫోన్ లు మాట్లాడుతున్నా లేఖలు రాసేదని కామెంట్
Sonu Sood Remembers His Mother Gets Emotional

కరోనా సమయంలో కాలినకడన వెళ్తున్న బడుగు జీవులకు, సాయం అని అర్థించిన వారికి ఆపన్నహస్తం అందించి హీరో అయిపోయాడు సోనూ సూద్. ఇప్పటికీ తనకు తోచినంత సాయం అందరికీ అందిస్తూనే ఉన్నారాయన. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కపిల్ శర్మతో కలిసి గేమ్ ఆడారు.

ఈ సందర్భంగా తన తల్లి సరోజ్ సూద్ ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తాను చదువుకునే రోజుల్లో ఎప్పుడూ ఉత్తరాలు రాసేదని చెప్పిన ఆయన.. తన తల్లి రాసిన ఓ లేఖను చదివి వినిపించారు. ‘‘మా అమ్మకు ఉత్తరాలు రాసే అలవాటుంది. నా కాలేజీ రోజుల్లో రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ లో మాట్లాడుతున్నా.. ఉత్తరాలు విధిగా రాసేవారు. ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం కదా.. ఎందుకమ్మా ఈ ఉత్తరాలు? అని అడిగితే వచ్చిన సమాధానం ఎప్పటికీ మరచిపోలేను’’ అని చెప్పారు.

‘నేను చనిపోయినప్పుడు ఈ ఉత్తరాలు నీ దగ్గర ఉంటాయి.. ఫోన్ రికార్డులు చెరిగిపోతాయి’ అని అమ్మ చెప్పిందంటూ గుర్తు చేసుకున్నారు. తన తల్లి రాసిన 25 ఉత్తరాలు తన దగ్గరున్నాయని, అమ్మ మాత్రం లేరని భావోద్వేగానికి గురయ్యారు. వాటిని చదువుతున్నప్పుడు అమ్మ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుందని, కాస్త ఒత్తిడిలో ఉంటే వాటిని చదువుతానని.. వెంటనే కొత్త ఉత్సాహం ఆవహిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా తన తల్లి రాసిన ఓ లేఖను చదివి వినిపించారు.

‘‘నువ్వు దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్నా.. ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. నువ్వు ఆనందంగా ఉంటేనే నేనూ ఆనందంగా ఉంటాను. నీ ప్రతి బాధలో నేను తోడుంటాను. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని నేను కోరుకుంటున్నా. రాబోయే ప్రతి క్షణం నీకు అంతా మంచే జరగాలి. నీ కోసం నేను ఏదైనా చేసేందుకు సిద్ధం. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి. సాధించలేకపోయానని నిరాశ వద్దు.. నీ లక్ష్యం కఠినమైనదని అలసత్వం వద్దు’’ అంటూ ముగించాడు.

More Telugu News