Encounter: గ్యారపట్టి ఎన్ కౌంటర్: నక్సల్స్ వైపు భారీగా ప్రాణనష్టం... 26 మంది మావోల మృతి

Huge lose to Naxals in Gadchiroli district
  • గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
  • నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు
  • దద్దరిల్లిన గ్యారపట్టి అటవీప్రాంతం
  • దాడుల్లో పాల్గొన్న మహారాష్ట్ర సీ-60 కమాండో యూనిట్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతం రక్తసిక్తమైంది. ఈ ఉదయం భద్రతా బలగాలకు, నక్సల్స్ కు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మావోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరణించిన మావోల సంఖ్య 26కి పెరిగింది. కాగా, ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు.

కాగా, ఈ ఎన్ కౌంటర్ లో మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సీ-60 కమాండో యూనిట్ పాల్గొంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ తరహాలోనే మహారాష్ట్రలో నక్సల్స్ పై పోరుకు సీ-60 యూనిట్ ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. గడ్చిరోలి జిల్లాలోని గ్యారపట్టి అటవీప్రాంతం చత్తీస్ గఢ్ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. ఇక్కడ మావోయిస్టులకు మంచి పట్టు ఉందని భావిస్తారు. భౌగోళికంగా అనుకూలంగా ఉండడంతో సుదీర్ఘకాలంగా నక్సల్ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అయితే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మర్దింటోలా గ్రామం సమీపంలో చత్తీస్ గఢ్ నుంచి గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశిస్తున్నారన్న పక్కా సమాచారంతో సీ-60 యూనిట్ కూంబింగ్ నిర్వహించింది. పోలీసులను చూసిన నక్సల్స్ కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులతో దీటుగా బదులివ్వడంతో ఆ ప్రాంతం తుపాకీ మోతలతో దద్దరిల్లిపోయింది. కాగా, నక్సల్స్ వైపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
Encounter
Gadchiroli
Naxals
C-60
Police
Maharashtra

More Telugu News