Blood Pressure: ఈ రెండు రకాల బీపీ మందులతో మధుమేహానికి చెక్..!

  • షుగర్ ముప్పు 16 శాతం వరకు తగ్గుదల
  • ఏసీఈ, ఏఆర్బీలతో డయాబెటిస్ దూరం
  • ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధనలో వెల్లడి
  • 1,45,939 మంది డేటా పరిశీలన
Blood Pressure Medicines Cut The Risk Of Diabetes

ఓ సమస్యకు వాడే మందులతో మరో అనారోగ్య సమస్య నయమవుతుందా? అంటే మధుమేహం విషయంలో సాధ్యమే అవుతుందంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. అధిక రక్తపోటుకు వాడే రెండు రకాల ఔషధాలు.. భవిష్యత్ లో మధుమేహం (టైప్ 2) రాకుండా అడ్డుకుంటున్నట్టు తేల్చారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కలిసి చేసిన ఈ అధ్యయనానికి బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ నిధులను సమకూర్చింది.

అధ్యయనంలో భాగంగా బీపీ మందులు వాడుతున్న 1,45,939 మంది డేటాను పరిశీలించారు. 19 ర్యాండమైజ్ ట్రయల్స్ నిర్వహించారు. నాలుగున్నరేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో కేవలం 9,883 మందికే మధుమేహం వచ్చినట్టు నిర్ధారించారు. రక్తపోటులో (సిస్టాలిక్) 5 ఎంఎం తగ్గినా డయాబెటిస్ ముప్పు 11 శాతం తగ్గుతుందని తేల్చారు. ఇక, జన్యు ప్రభావాల వల్ల బీపీ స్థాయులు తగ్గిన వారిలో ఆ ముప్పు 12 శాతం తక్కువన్నారు.

స్టడీలో భాగంగా ఐదు ప్రధాన బీపీ ఔషధాల వల్ల మధుమేహంపై కలిగే ప్రభావాలపైనా విశ్లేషణ జరిపారు. దాదాపు 22 ప్లాసిబో (డమ్మీ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ) ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ 2 బ్లాకర్ (ఏఆర్బీ) అనే రెండు రకాల బీపీ మందులు మధుమేహం నుంచి రక్షిస్తున్నట్టు గుర్తించారు. వాటి వల్ల అత్యధికంగా షుగర్ రోగం ముప్పు 16 శాతం తగ్గుతుందని నిర్ధారించారు. కాల్షియం చానెల్ బ్లాకర్ లు ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని, బీటా బ్లాకర్, థయజైడ్ డయూరిటిక్స్ తో మధుమేహం ముప్పు ఎక్కువైందని స్పష్టం చేశారు. ఆయా మందులు మన శరీరంపై వేర్వేరుగా పనిచేసే తీరు వల్లే.. డయాబెటిస్ ముప్పు తగ్గడం, పెరగడానికి కారణమవుతోందని చెబుతున్నారు.

More Telugu News