వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్న తల్లే పొట్టనపెట్టుకుంది.. వీడిన పంజాగుట్ట బాలిక హత్య కేసు
- నిందితులు పాతబస్తీ వారని గుర్తింపు
- అజ్మేర్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్
- వాళ్లు యాచకులంటున్న పోలీసులు
- ఇవాళ మధ్యాహ్నం వివరాలు వెల్లడించే అవకాశం
ఈ నెల 4న పంజాగుట్ట ద్వారకాపురికాలనీలోని ఓ దుకాణం ముందు గుర్తు తెలియని ఐదేళ్ల బాలిక మృతదేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఒంటిపై కమిలిన గాయాలుండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలిక ఆచూకీ తెలుసుకోవడం కోసం మర్నాడే ప్రకటన కూడా విడుదల చేశారు.
నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను అధికారులు విస్తృతంగా పరిశీలించారు. వేరే రాష్ట్రాల్లోనూ గాలించారు. ప్రత్యేక బృందం కర్ణాటకకు వెళ్లింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకూ అమ్మాయి ఫొటోతో కూడిన ప్రకటనను పంపించారు.
ఈ క్రమంలోనే బుధవారం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొరికిన ఆధారంతో నిందితులు అజ్మేర్ లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారిద్దరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. భర్త చనిపోవడంతో ఆ బాలిక తల్లి.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించారు. వారు యాచకులని తెలుస్తోంది.