Adimulapu Suresh: తండ్రీకొడుకులిద్దరూ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు: ఆదిమూలపు సురేశ్

  • ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఏమిటో లోకేశ్ కి తెలుసా?
  • చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎయిడెడ్ పాఠశాలల గురించి ఆలోచించారా?
  • కుటిల రాజకీయాలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు
Do Nara Lokesh knows about Aided schools asks Adimulapu Suresh

చంద్రబాబు, నారా లోకేశ్ లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శలు గుప్పించారు. ఎయిడెడ్ పాఠశాలలకు అన్యాయం చేస్తున్నారని లోకేశ్ అంటున్నారని... అసలు ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఏమిటో లోకేశ్ కి తెలుసా? అని ఎద్దేవా చేశారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం వల్ల వారంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఇక ప్రభుత్వ పాఠశాలలో కలవాలా? వద్దా? అనే విషయాన్ని కూడా ఎయిడెడ్ పాఠశాలలకే వదిలేశామని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎయిడెడ్ పాఠశాలల గురించి ఆలోచించారా? అని అడిగారు. ఖాళీగా ఉన్న ఎయిడెడ్ టీచర్ల నియామకాలను చేసేది లేదని చెప్పింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

అనంతపురం ఘటనను కూడా వక్రీకరించారని... రాళ్లు వేశారని గాయపడిన విద్యార్థిని స్పష్టంగా చెపుతుంటే... పోలీసులు లాఠీఛార్జి చేశారని టీడీపీ నేతలు అంటున్నారని సురేశ్ మండిపడ్డారు. కుటిల రాజకీయాలు చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. విద్యాశాఖపై ఇప్పటి వరకు 30కి పైగా కేసులు వేయించారని... ఒక్కదాంట్లో అయినా కోర్టు స్టే విధించిందా? అని ప్రశ్నించారు.

More Telugu News