శివ కార్తికేయన్ 'డాన్' నుంచి ఫస్టులుక్!

10-11-2021 Wed 18:19
  • 'డాక్టర్' సినిమాతో దొరికిన హిట్
  • ఒక్కసారిగా 100 కోట్ల క్లబ్ లోకి
  • మరోసారి ప్రియాంక అరుళ్ మోహన్ కి ఛాన్స్    
Don first look released
తమిళనాట ఇప్పుడు శివకార్తికేయన్ జోరు అందుకుంది. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ మిగతా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'డాక్టర్' సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకి ఆయనే నిర్మాత కావడం విశేషం.

ఇక లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఆయన మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'డాన్' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. 'డాక్టర్' సినిమాలో తన జోడీగా అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలోనూ నాయిక. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ను కాలేజ్ నేపథ్యంలో డిజైన్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తమ చేతిలో ఉన్న వస్తువులను శివ కార్తికేయన్ పైకి విసురుతున్నట్టు .. టీచర్స్ ను టార్చర్ పెట్టడం ఎలా? అనే బుక్స్ ను చదువుతున్నట్టు ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. దీనిని బట్టి ఇది కామెడీ టచ్ ఉన్న కథ అనీ .. కాలేజ్ లెక్చరర్ అయిన శివకార్తికేయన్ వారి పట్ల ఒక 'డాన్'లా వ్యవహరిస్తాడని అర్థమవుతోంది.