Team India: టీమిండియాలో ముంబయి గ్రూప్ వర్సెస్ ఢిల్లీ గ్రూప్...?

Pakistan former leggy Mushtaq Ahmed says there is two groups in Team India
  • టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
  • కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ
  • జట్టులో విభేదాలు ఉన్నాయంటున్న ముస్తాక్
  • విజయవంతమైన కెప్టెన్ తప్పుకోవడం ఏంటని సందేహం
టీ20 ఫార్మాట్లో టీమిండియాకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించిన సెలెక్టర్లు, న్యూజిలాండ్ తో సిరీస్ కు జట్టును ప్రకటించారు. కివీస్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడబోవడంలేదని సెలెక్టర్లు స్పష్టం చేశారు. కోహ్లీకి విశ్రాంతినిచ్చామని చెబుతున్నారు. టీ20 ఫార్మాట్లో తాను కెప్టెన్ గా తప్పుకున్నప్పటికీ, ఆటగాడిగా కొనసాగుతానని కోహ్లీ గతంలోనే చెప్పాడు. అయితే, ఇవాళ ప్రకటించిన జట్టులో కోహ్లీ పేరులేదు.

ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ స్పందించాడు. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడం టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఏమీ బాగాలేదన్న దానికి నిదర్శనం అని పేర్కొన్నాడు. "ఓ విజయవంతమైన కెప్టెన్ తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడంటే దానర్థం జట్టులో విభేదాలున్నాయనే.

ఇప్పుడు టీమిండియాలో నాకు రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. ఒకటి ఢిల్లీ గ్రూప్, రెండోది ముంబయి గ్రూప్. టీమిండియా ఆటగాళ్లు ఈ రెండు గ్రూపులుగా విడిపోయారు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతాడనిపిస్తోంది. కానీ ఐపీఎల్ లో కొనసాగుతాడని భావిస్తున్నాను" అని వివరించాడు. కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు కాగా, రోహిత్ శర్మ ముంబయి వాలా అని తెలిసిందే.

ఇక టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఓటములకు ఐపీఎలే కారణమని ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీకి ముందు దీర్ఘకాలంగా బయోబబుల్ లో ఉండడం ఆటగాళ్లను అలసటకు గురిచేసిందని అభిప్రాయపడ్డాడు.

అటు, పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు కూడా మనుషులేనని, ఇన్నాళ్లపాటు బయోబబుల్ లో ఉండడం ఏమంత సులువు కాదని అన్నాడు. ఈ వరల్డ్ కప్ కు టీమిండియా ఆటగాళ్లు మానసికంగా సంసిద్ధంగా లేరన్న రవిశాస్త్రి అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తానని హక్ పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్-2లో ఉన్న టీమిండియా... పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను చేజార్చుకోవడం తెలిసిందే. దాంతో జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే భారత్ సెమీస్ వెళ్లే చాన్సు ఉన్నప్పటికీ, ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవడంతో భారత్ ఆశలకు తెరపడింది. గ్రూప్-2లో ఆ రెండు ఓటముల తర్వాత టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచినా ఫలితం లేకపోయింది.
Team India
Groups
Mumbai
Delhi
Mushtaq Ahmed
Pakistan

More Telugu News