Ravi Shastri: మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ, ఐసీసీలపై ధ్వజమెత్తిన రవిశాస్త్రి

  • గత రాత్రి నమీబియాపై టీమిండియా విజయం
  • టీ20 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ ఆడిన భారత్
  • టీమిండియా కోచ్ గా శాస్త్రి పదవీకాలం ముగిసిన వైనం
  • టీ20 కెప్టెన్ గా తప్పుకుంటున్న కోహ్లీ
Ravi Shastri comments on BCCI and ICC

టీ20 వరల్డ్ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ను నమీబియాపై ఆడిన టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీ అనంతరం భారత టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి తప్పుకుంటున్నారు. గతరాత్రి చివరి మ్యాచ్ ముగిసిన నేపథ్యంలో, రవిశాస్త్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో టీమిండియా పరిస్థితికి బీసీసీఐ, ఐసీసీనే కారణమని ఆరోపించారు. గుక్కతిప్పుకోలేనంత బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసి టీమిండియా ఓటములకు పరోక్షంగా కారణమయ్యాయని మండిపడ్డారు.

గత 6 నెలలుగా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్ లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడు అయినా శారీరకంగా, మానసికంగా అలసిపోతారని వివరించారు. క్రికెటర్లు కూడా మనుషులేనని, పెట్రోల్ పోసి నడపడానికి వారేమీ యంత్రాలు కాదని రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఏ జట్టు అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుందని, కానీ భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని అన్నారు. ఆటగాళ్లకు ఏమాత్రం వ్యవధి ఇవ్వకుండా బీసీసీఐ, ఐసీసీ షెడ్యూల్ రూపొందించాయని విమర్శించారు. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనన్న సంగతిని బోర్డులు, అభిమానులు గుర్తించాలని పేర్కొన్నారు.

కాగా, టీమిండియా కోచ్ గా పదవీకాలం ముగించుకున్న రవిశాస్త్రికి కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాట్లను కానుకగా ఇచ్చారు.

More Telugu News