Maharashtra: షారూఖ్.. ఇప్పటికైనా నోరు విప్పు.. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

  • ఆర్యన్ ఖాన్ ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారు
  • సమీర్ వాంఖడేతో బీజేపీ నేత ఆడిన డ్రామా
  • షారూఖ్ కు ఇప్పటికీ బెదిరింపులొస్తున్నాయి
Nawab Malik Yet Again Makes Sensational Comments

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షారూఖ్ ఖాన్ ను కావాలనే మొదట్నుంచీ ఇబ్బందిపెడుతున్నారని, ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఆర్యన్ అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి షారూఖ్ కు బెదిరింపులు మొదలయ్యాయని అన్నారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూజా దడ్లానీ పేరు బయటకు వచ్చినప్పట్నుంచి మాట్లాడొద్దంటూ షారూఖ్ కు బెదిరింపులు వచ్చాయన్నారు. ఇప్పటికైనా షారూఖ్ నోరు విప్పి మాట్లాడాలని, ఆర్యన్ ను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారన్న విషయం చెప్పాలని మాలిక్ అన్నారు.

ఈ కిడ్నాప్ డ్రామాకు మాస్టర్ మైండ్ బీజేపీ నేత మోహిత్ కంబోజ్ అని ఆరోపించారు. ఆర్యన్ అసలు క్రూయిజ్ టికెట్ కొనలేదన్నారు. ప్రతీక్ గాబా, ఆమిర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు ఆర్యన్ ను తీసుకెళ్లారని చెప్పారు. ఈ కేసు పూర్వ విచారణ అధికారి అయిన సమీర్ వాంఖడేతో కలిసి మోహిత్ కంబోజ్ ఆర్యన్ ను కిడ్నాప్ చేశారన్నారు. తర్వాత షారూఖ్ తో డబ్బు బేరం పెట్టాడని సంచలన ఆరోపణ చేశారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి ఓ పార్టీలో వాంఖడేని మోహిత్ కలిశాడని చెప్పారు. క్రూయిజ్ పార్టీకి వెళ్లిన రిషభ్ సచ్దేవా, ప్రతీక్ గాబా, అమీర్ ఫర్నీచర్ వాలాను విడిచిపెట్టారన్నారు.

మోహిత్ కంబోజ్ కు రిషభ్ సచ్దేవా బావమరిదన్నారు. ఆ ముగ్గురిని వదిలేయడంలోనే డ్రగ్స్ కేసంతా దాగుందన్నారు. మహారాష్ట్ర పరువును తీయడానికే ఈ నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. ఆరోజు ఫ్యాషన్ టీవీ ఇండియా ఎండీ కషీఫ్ ఖాన్ అదే షిప్ లో ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ నూ పార్టీకి రావాల్సిందిగా కషీఫ్ ఒత్తిడి చేశాడని, అంతేగాకుండా కొందరు మంత్రుల పిల్లలనూ తీసుకొచ్చేందుకు పథకం వేశారని మండిపడ్డారు. ఒకవేళ తమ మంత్రి అక్కడికి వెళ్లి ఉంటే ఉడ్తా పంజాబ్ లాగా ‘ఉడ్తా మహారాష్ట్ర’ అని సృష్టించేవారన్నారు. తాను పోరాడుతున్నది ఎన్సీబీ, బీజేపీతో కాదని, తప్పుపై ఫైట్ చేస్తున్నానని అన్నారు.

More Telugu News