China: జైల్లో చావు అంచుల్లో.. వూహాన్ లో కరోనా ప్రభంజనాన్ని కవర్ చేసిన మహిళా జర్నలిస్టు!

  • కరోనా విషయాలను కవర్ చేసినందుకు జైల్లో పెట్టిన చైనా ప్రభుత్వం
  • ఆహారాన్ని తీసుకోవడం మానేసిన ఝాంగ్ ఝూన్
  • ఆమె బతికే అవకాశాలు లేవని చెప్పిన సోదరుడు
China journalist Zhang Zhan who covered Wohan corona close to death

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ లో పుట్టిన సంగతి తెలిసిందే. ఆ తొలినాళ్లలో వూహాన్ లోని కరోనా పరిస్థితులను కవర్ చేసిన సిటిజన్ జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్ (38) ఇప్పుడు చావుకు చాలా దగ్గర్లో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఆమె వూహాన్ కు వెళ్లి కరోనాకు సంబంధించిన వాస్తవాలను కవర్ చేయడం ప్రారంభించారు. వృత్తి రీత్యా ఆమె లాయర్ కావడం గమనార్హం.

వూహాన్ కు వెళ్లిన ఆమె... అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియోలు తీసి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో... అక్కడి అధికారుల తీరును ఆమె ఎండగట్టారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు... అక్కడి కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది.

అయితే, ప్రభుత్వం తనపై తీసుకున్న చర్యలను నిరసిస్తూ జైల్లోనే ఆమె నిరశన దీక్షకు దిగారు. ఆహారాన్ని తీసుకోవడాన్ని ఆపేశారు. ప్రస్తుతం ఆమెకు ముక్కులో నుంచి ట్యూబుల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆమె లీగల్ టీమ్ కు కూడా పూర్తిగా సమాచారం లేదు.

ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు ఝాంగ్ ఝూ స్పందిస్తూ... రాబోయే గడ్డు శీతాకాల పరిస్థితుల్లో ఆమె బతికే అవకాశాలు ఏ మాత్రం లేవని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఆమెకు చాలా లేఖలు రాశానని తెలిపారు. ప్రస్తుతం ఆమె తాను నమ్మిన సిద్ధాంతాలు, ఆమె నమ్మే దేవుడి గురించే ఆలోచిస్తోందని.. ఇతర విషయాలను పట్టించుకోవడం లేదని చెప్పారు.

ఝాంగ్ ఝూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచాన్నే కదిలిస్తున్నాయి. ఆమెను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జైలు నుంచి విడుదల చేస్తేనే ఆమె నిరాహార దీక్షను ఆపుతుందని, అవసరమైన వైద్య చికిత్సను పొందుతుందని తెలిపింది. ఝాంగ్ ను నిర్బంధించడం మానవ హక్కులపై చైనా ప్రభుత్వం తీసుకున్న సిగ్గులేని చర్య అని ఆమ్నెస్టీ క్యాంపెయినర్ గ్వెన్ లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ... చైనా ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని వ్యాఖ్యానించింది. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారెవరైనా శిక్షను అనుభవించాల్సిందేనని తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

More Telugu News