అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పారు: ప్రధాని మోదీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

04-11-2021 Thu 20:18
  • దీపావళి సందర్భంగా సరిహద్దుల్లో మోదీ పర్యటన
  • వీర జవాన్లతో గడిపిన ప్రధాని
  • సైనికుల వల్లే మనం క్షేమంగా ఉన్నామన్న ఆనంద్
  • ట్విట్టర్ లో స్పందన
Anand Mahindra heaps praise on PM Narendra Modi
ప్రతి ఏడాది దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులతో వేడుకలు జరుపుకోవడం పరిపాటిగా మారింది. నేడు కూడా ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ లో పర్యటిస్తూ అక్కడ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వీరజవాన్లను కలిశారు. వారికి మిఠాయిలు తినిపించి ఉల్లాసంగా గడిపారు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఒక అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పారంటూ ప్రధాని మోదీని కొనియాడారు.

దేశ ప్రజలు ఎలాంటి భయం లేకుండా దీపావళి జరుపుకుంటున్నారంటే అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న జవాన్ల వల్లేనని తెలిపారు. తమ కుటుంబాలను కూడా వదిలి వారు దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం వల్లే మనం మన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోగలుగుతున్నామని ఆనంద్ మహీంద్రా వివరించారు. ఆ వీరసైనికుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని తెలిపారు.