Cricket: యువీ రీ ఎంట్రీ.. 'పిచ్ పైకి వస్తున్నా' అంటూ ప్రకటన

What Does Yuvi Says About His Re Entry
  • 'బహుశా ఫిబ్రవరిలో..' అంటూ ఇన్ స్టా పోస్టు
  • తన బ్యాటింగ్ వీడియో జత చేసిన యువరాజ్
  • టీమిండియాకు మద్దతివ్వాలని అభిమానులకు విజ్ఞప్తి
2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై యువీ కొట్టిన ఆ ఆరు సిక్సర్లను మరచిపోగలమా? ఫ్లింటాఫ్ నోటి దురుసుతో గొడవ పెట్టుకుంటే.. బ్రాడ్ బౌలింగ్ లో బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు యువీ. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదేసి చరిత్ర సృష్టించాడు. అదే ఇంగ్లండ్ పై 2002లో లార్డ్స్ వేదికగా 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో యువీ బ్యాటింగ్ నూ మరచిపోవడం కష్టమే. అలాంటి ఎన్నెన్నో ఇన్నింగ్స్ లకు యూవీ మారు పేరు.

2007 టీ20 వరల్డ్ కప్ లోనూ.. 2011 వన్డే వరల్డ్ కప్ లోనూ యువీ పెర్ఫార్మెన్స్ కు పేరు పెట్టలేం. 2011 వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను అందుకుని జట్టు కప్పు కొట్టడంలో కీలకంగా వ్యవహరించాడు. అలాంటి స్టార్ ఆటగాడు.. కేన్సర్ కారణంగా కొన్నాళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. కేన్సర్ ను జయించి మళ్లీ మైదానంలోకి దిగాడు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. తర్వాత 2019లో ఆటకు గుడ్ బై చెప్పాడు.


అయితే.. తాజాగా యువీ చేసిన ప్రకటన ఒకటి అందరినీ షాక్ కు గురి చేసింది. తాను మళ్లీ వచ్చేస్తున్నానంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు డాషింగ్ అండ్ స్టైలిష్ బ్యాటర్. ‘‘మన విధిని ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అభిమానుల డిమాండ్ మేరకు నేను మళ్లీ పిచ్ పైకి వచ్చేస్తున్నా. బహుశా ఫిబ్రవరిలోనే! ఇంతకు మించిన గొప్ప అనుభవం ఏముంటుంది! మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ ఆశీస్సులతో మరింత ముందుకెళ్తా. ఇండియాకు మీరు మరింత మద్దతివ్వాలి. అది మన జట్టు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు మద్దతిచ్చేవారే నిజమైన అభిమానులు’’ అంటూ పోస్ట్ పెట్టాడు. దానికి తన గత మ్యాచ్ ల బ్యాటింగ్ వీడియోను జత చేశాడు. దీంతో యువీ పోస్ట్ కాస్తా ఆసక్తికరంగా మారింది.

యువీ పోస్టుకు ముంబై ఇండియన్స్.. ‘మేం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్ పెట్టింది. ‘పాజీ ప్లానేంటో’ అంటూ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)’ అంటూ క్రికెటర్ మన్ దీప్ సింగ్ రిప్లై ఇచ్చాడు. పలువురు ప్రముఖులు అతడి కోసం ఎదురు చూస్తున్నామంటూ బదులిచ్చారు. మరి, యువీ మాటల్లో ఆంతర్యమేంటి? అతడు నిజంగానే బరిలోకి దిగుతున్నాడా? మళ్లీ బ్యాట్ పడుతున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే!
Cricket
Yuvraj Singh
Re Entry
Team India

More Telugu News