Drug Case: డ్రగ్స్ కేసుకు రాజకీయ రంగు.. ఫడ్నవీస్ భార్యతో డ్రగ్ పెడ్లర్ కలిసివున్న ఫొటోను విడుదల చేసిన 'మహా' మంత్రి నవాబ్ మాలిక్

  • క్రూయిజ్ డ్రగ్స్ కేసులో తొలి నుంచి బీజేపీపై ఆరోపణలు చేస్తున్న నవాబ్ మాలిక్
  • క్రూయిజ్‌లో పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ జయదీప్‌ రాణాతో ఫడ్నవీస్ భార్య అమృత
  • బీజేపీ, డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధాలపై ఇంతకు మించిన సాక్ష్యం ఎందుకన్న మంత్రి
  • మంత్రికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయన్న ఫడ్నవీస్
Nawab Malik tweets photo of alleged drug peddler with Fadnavis wife Amruta

ముంబై ‘క్రూయిజ్’ డ్రగ్స్ కేసు రోజురోజుకు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసులో బీజేపీ ప్రమేయం ఉందని తొలి నుంచీ ఆరోపిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ నిన్న మరో అడుగు ముందుకేశారు. ముంబై నౌకలో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ జయదీప్ రాణాతో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. బీజేపీకి, డ్రగ్స్ ముఠాకు ఉన్న సంబంధాలేంటో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలన్నారు.

నవాబ్ మాలిక్ షేర్ చేసిన ఫొటోపై ఫడ్నవీస్ కూడా అంతే దీటుగా స్పందించారు. ఆ ఫొటో నాలుగేళ్ల క్రితం నాటిదని అన్నారు. ‘రివర్ మార్చ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ ఆల్బం కోసం షూట్ చేస్తున్న సమయంలో ఆ ఫొటో తీశారని స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆ ఫొటో సెషన్, ఆల్బంలోనూ పాల్గొన్నట్టు చెప్పారు. డ్రగ్ పెడ్లర్‌గా చెబుతున్న జయదీప్‌తోపాటు మరికొందరిని కూడా ఆ సంస్థ తీసుకొచ్చిందని అన్నారు. డ్రగ్ పెడ్లర్‌తో ఫొటో ఉంటే బీజేపీతో డ్రగ్స్ ముఠాలకు సంబంధం ఉన్నట్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నవాబ్ మాలిక్ మేనల్లుడు సమీర్‌ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడని, అంతమాత్రానికే ఎన్‌సీపీకి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని తాము అన్నామా? అని ప్రశ్నించారు. అంతేకాదు, నవాబ్ మాలిక్‌కు అండర్‌ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆ వివరాలను దీపావళి తర్వాత వెల్లడిస్తానన్నారు.

More Telugu News