Rajasthan: బాలుడిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన హైకోర్టు

 Judge and 2 others booked for raping 14year old boy in Rajasthan
  • రాజస్థాన్‌లో ఘటన
  • ఆడుకునేందుకు వెళ్లిన బాలుడితో పరిచయం పెంచుకున్న జడ్జి
  • ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చి వికృత చేష్టలు
14 ఏళ్ల బాలుడిని ఓ న్యాయమూర్తి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్థాన్‌లో సంచలనం సృష్టించింది. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ కేసులు పరిశీలించే భరత్‌పూర్ ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర గొలియా, ఆయన ఇద్దరు సహాయకులు తన కుమారుడిని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

అంతేకాదు, ఈ విషయాన్ని బయటపెడితే కాల్చి చంపుతానని జడ్జి తనను బెదిరించారని పేర్కొన్నారు. విషయం వెలుగులోకి రావడంతో హైకోర్టు స్పందించింది. జడ్జి జితేంద్ర గొలియాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బాలుడిని బెదిరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర్‌లాల్ యాదవ్‌పైనా సస్పెన్షన్ వేటు పడింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఏడో తరగతి చదువుతున్న బాధిత బాలుడు భరత్‌పూర్ మైదానానికి ఆడుకునేందుకు వెళ్లేవాడు. జడ్జి జితేంద్ర, ఆయన సహాయకులు కూడా అక్కడికే వస్తుండేవారు. ఈ క్రమంలో చిన్నారితో స్నేహం పెంచుకున్న వారు బాలుడిని ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తుపదార్థాలు ఇచ్చేవారు. స్పృహ కోల్పోయిన తర్వాత వికృత చేష్టలకు పాల్పడేవారు. విషయాన్ని బాలుడు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
Judge
Sexual Harassment
Boy

More Telugu News