Andhra Pradesh: అప్పు కోసం చేసుకున్న ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు చేర్చిన ఏపీ ప్రభుత్వం.. బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అసంతృప్తి

AP Governor Fires on AP Government due to add his name in loan papers
  • ఏపీఎస్‌డీసీ ద్వారా రూ. 25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం
  • నోటీసులు పంపించాల్సిన చిరునామాలో గవర్నర్ పేరు
  • దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమణ
  • వివరణ ఇచ్చేందుకు రాజ్‌భవన్‌కు క్యూ కడుతున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) ద్వారా రూ. 25 వేల కోట్ల రుణం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం ఇందుకోసం చేసుకున్న ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు చేర్చింది.

విషయం తెలిసిన బిశ్వభూషణ్ తీవ్రంగా ఆక్షేపించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గవర్నర్‌కు వివరణ ఇచ్చేందుకు కదిలిన ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, రుణ ఒప్పందాల్లో గవర్నర్ పేరు చేర్చడాన్ని ఇటీవల హైకోర్టు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కాగా, గవర్నర్ ఆగ్రహంతో దిగొచ్చిన ప్రభుత్వం ఆయన పేరును తొలగించి కొత్తగా మళ్లీ ఒప్పందం కుదుర్చుకోవాలా? లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అన్న విషయమై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

గవర్నర్ ఆగ్రహానికి మరో కారణం.. బ్యాంకులతో ప్రభుత్వం చేసుకున్న రుణ ఒప్పందంలో ఆయన చిరునామా ఇవ్వడం. బ్యాంకులు కనుక ఒకవేళ నోటీసులు ఇవ్వాల్సి వస్తే వాటిని ఎవరికి పంపించాలన్న చిరునామాలో వ్యక్తిగతంగా గవర్నర్ చిరునామా ఇచ్చారు. అలాగే, గ్యారంటీ ఒప్పంద పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతకాలు పెట్టాల్సిన ప్రతి చోట ‘ఆంధ్రప్రదేశ్ గవర్నర్’ అని పేర్కొన్నారు. దానికింద ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి సీహెచ్‌వీఎన్ మల్లేశ్వరరావు సంతకాలు చేశారు. చిరునామాలో శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, కేరాఫ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ఏపీ సెక్రటేరియట్ అని పేర్కొన్నారు.
Andhra Pradesh
Governor
Biswabhusan Harichandan

More Telugu News