Earthquake: తెలంగాణలో నిన్న స్వల్ప భూప్రకంపనలు.. మహారాష్ట్రలో భూకంప కేంద్రం

Earthquake occured in many districts in Telangana
  • మూడు నుంచి ఐదు సెకన్ల పాటు కంపించిన  భూమి
  • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
  • రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత నమోదు
తెలంగాణలోని పలు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న సాయంత్రం 6.48 గంటల సమయంలో మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. మూడు నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల పట్టణంలోని రహమత్‌పురా, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు కనిపించడం గమనార్హం.

పెద్దపల్లి జిల్లా ముత్తారం, రామగుండం మండలాల్లోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెగుళ్లపల్లితోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు ప్రకంపనలు కనిపించింది.

అలాగే, మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలంలోని రేకంపల్లి, కొత్తపల్లి (బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూకంపం వచ్చిందని, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైందని అధికారులు తెలిపారు.
Earthquake
Telangana
Adilabad District
Mancherial District
Jayashankar Bhupalpally District

More Telugu News