Rajinikanth: పూర్తిగా కోలుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఆసుపత్రి నుంచి ఇంటికి

 Actor Rajinikanth Discharged From Chennai Hospital
  • ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసిన సూపర్‌స్టార్
  • గత నెల 28న ఆసుపత్రిలో చేరిక
  • మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో సమస్య
  • ప్రొసీజర్ ద్వారా సమస్యను సరిదిద్దిన వైద్యులు
తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ గత నెల 28న చెన్నై చేరుకోగానే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.

ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు తలకు రక్తాన్ని చేరవేసే ధమనిలో సమస్య ఉన్నట్టు గుర్తించి, మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్ ను ప్రొసీజర్ ద్వారా తొలగించారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్ అయ్యారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన రజనీ.. ఇంట్లో దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.

ఇదిలావుంచితే, గతేడాది డిసెంబరులోనూ రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అలసట, రక్తపోటులో హెచ్చుతగ్గులకు చికిత్స తీసుకున్నారు. కాగా, రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Rajinikanth
Kauvery Hospital
Chennai

More Telugu News