Sekhar Kammula: 'వర్జిన్ స్టోరీ' సినిమా యువతరానికి నచ్చుతుంది: టీజర్ విడుదల చేసిన శేఖర్ కమ్ముల

  • లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా చిత్రం
  • ప్రదీప్ దర్శకత్వంలో వస్తున్న వర్జిన్ స్టోరీ
  • ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం
  • చీఫ్ గెస్టుగా శేఖర్ కమ్ముల
Sekhar Kammula releases Virgin Story teaser

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా 'వర్జిన్ స్టోరీ'. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విక్రమ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న 'రౌడీ బాయ్స్' లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. విక్రమ్ హీరోగా చేస్తున్న తొలి చిత్రం 'వర్జిన్ స్టోరీ'. కొత్తగా రెక్కలొచ్చెనా... అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి 'వర్జిన్ స్టోరీ' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో  అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీధర్ గారు తనకు చాలా కాలంగా స్నేహితులు అని వెల్లడించారు. సినిమా అంటే ఎంతో తపన ఉన్న ప్రొడ్యూసర్ అని తెలిపారు. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టమని, నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారని వివరించారు.

"ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్  తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. వర్జిన్ స్టోరీ టీజర్, పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్  చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని పేర్కొన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. తనకు దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే చాలా ఇష్టమని, ఆయన 'హ్యాపీడేస్' చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేయాల్సిందని కానీ కుదరలేదని వెల్లడించారు. 'గోదావరి' సినిమా చూశాక శేఖర్  గారికి సన్మాన సభ పెట్టి సత్కరించినట్టు వివరించారు.

"ఇవాళ మా అబ్బాయి మూవీ వర్జిన్ స్టోరి టీజర్ రిలీజ్ కు శేఖర్ కమ్ముల రావడం సంతోషంగా ఉంది. వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమాలా ఉంటుందని అని చెప్పొచ్చు. అంటే టీనేజ్ ప్రేక్షకుల నుంచి 20 ఇయర్స్ వరకు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు. ఒక అమ్మాయి మంచి అబ్బాయి కోసం, అబ్బాయి మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు. ఎదుటి వ్యక్తుల నుంచి నిష్కల్మషమైన స్నేహం, ప్రేమను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు అద్దం పట్టే సినిమా అవుతుంది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ వర్జిన్ స్టోరి చిత్రంలో చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్. త్వరలోనే థియేటర్లలో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం" అని వివరించారు.

లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ...నిజమైన ప్రేమ దక్కాలంటే వేచి చూడాలని అన్నారు. ఆ సహనం ఉన్న వాళ్లకే అది దక్కుతుందని చెప్పే చిత్రం వర్జిన్ స్టోరి అని ఆమె స్పష్టం చేశారు. ఇందులో ఎక్కడా సందేశాలు ఉండవని, చూస్తున్నంతసేపు కంప్లీట్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇదని తెలిపారు. "మా అబ్బాయి హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ మూవీ ఇది. లైఫ్ లో మన చుట్టూ, మనకు తెలిసిన సందర్భాలు ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి. థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించండి" అన్నారు.

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ... దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటానని వెల్లడించారు. 'వర్జిన్ స్టోరీ' సినిమాను తన జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించినట్టు తెలిపారు. "విక్రమ్ లాంటి కసి ఉన్న నటుడు నా మొదటి సినిమాకు హీరోగా దొరకడం అదృష్టం. ప్రతి సీన్ కు సాధన చేసేవాడు. తన పూర్తి ప్రయత్నంతో నటించేవాడు. విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుంది" అని అభిప్రాయపడ్డారు.

విక్రమ్, సౌమిక, పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి, సినిమాటోగ్రఫీ అనీష్ తరుణ్ కుమార్ అందిస్తున్నారు. ఎడిటింగ్... గ్యారీ, సాహిత్యం భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్ అందిస్తున్నారు. వర్జిన్ స్టోరీ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర వ్యవహరిస్తున్నారు.

More Telugu News