Chinta Mohan: ప్రశాంత్ కిశోర్ ఒక బచ్చా.. కాంగ్రెస్ బలహీనపడటానికి ఇద్దరు కారణం: చింతా మోహన్

  • కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిశోర్ కు ఏం తెలుసు?
  • ఏపీ విభజనకు వైయస్సార్ కారణం
  • రాష్ట్రంలో రెండు సామాజికవర్గాలే పాలన సాగిస్తున్నాయి
Prashat Kishor is a kid says Chinta Mohan

రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో బీజేపీ అత్యంత క్రియాశీలక పాత్రను పోషిస్తుందని... ఈ విషయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతా మోహన్ మండిపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ఒక బచ్చా అని అన్నారు. కాంగ్రెస్ గురించి ప్రశాంత్ కిశోర్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోరే కాదు... ఆయన అయ్య, తాత వచ్చినా రాహుల్ ని ఆపలేరని అన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి ఇద్దరు కారణమని చింతా మోహన్ చెప్పారు. వారిలో ఒకరు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు అని... అయోధ్య ఘటనతో కాంగ్రెస్ కు మైనార్టీలు దూరమయ్యారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వైయస్ రాజశేఖరరెడ్డి కారణమని చెప్పారు. చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేందుకు హైదరాబాద్ పాతబస్తీలో ఒక నాయకుడు మారణహోమం సృష్టించారని తెలిపారు. వందలాది మంది కాళ్లు, చేతులు తీసేశారని.. అయితే ఆ నాయకుడు ఇప్పుడు లేడని, చనిపోయాడని చెప్పారు.
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చింతామోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జగన్ గారూ మీ నాన్న ఆరేళ్లు సీఎంగా చేశారు, ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నారు, ఇక చాలు తప్పుకోండి' అని అన్నారు. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలే పాలన సాగిస్తున్నాయని... కేవలం ఆరు శాతం జనాభా మాత్రమే ఉన్న ఆ వర్గాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. 2024లో కాపు, బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవుతాడని అన్నారు.

More Telugu News