మ‌రోసారి డ్రోన్‌ను పంపి అల‌జ‌డి రేపిన పాకిస్థాన్‌

28-10-2021 Thu 12:21
  • గ‌త అర్ధ‌రాత్రి పంజాబ్ లోని అజ్నాలా పోలీసు స్టేషను పరిధిలో ఘ‌ట‌న‌
  • షాపూర్ సరిహద్దు ఔట్ పోస్టు వద్ద క‌న‌ప‌డిన డ్రోను
  • డ్రోన్ పైకి కాల్పులు జ‌రిపిన బీఎస్ఎఫ్‌
  • వెంటనే వెన‌క్కి వెళ్లిపోయిన వైనం
bsf spots another drone in jammu
స‌రిహ‌ద్దుల వ‌ద్ద పాకిస్థాన్ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. మ‌రోసారి డ్రోనును పంపి క‌ల‌క‌లం రేపింది. గ‌త అర్ధ‌రాత్రి పంజాబ్ లోని అజ్నాలా పోలీసు స్టేషను పరిధిలోని  షాపూర్ సరిహద్దు ఔట్ పోస్టు వద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  డ్రోను దూసుకువ‌స్తుండ‌డాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది దానిపైకి కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ వెన‌క్కి వెళ్లిపోయింది.

భార‌త‌ భూభాగంలో ఆయుధాలు, డ్రగ్స్ జారవిడిచేందుకు పాకిస్థాన్ ఆ డ్రోన్ ను పంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నెల‌ 19, 20వ తేదీల్లోనూ రాత్రి స‌మ‌యంలో అమృత్‌సర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దుల్లోనూ డ్రోన్ సంచ‌రించింది. అప్ప‌ట్లో దాన్ని జవాన్లు కూల్చివేశారు. కిలో హెరాయిన్ తోపాటు ఇనుప ఉంగరం అందులో ల‌భ్య‌మైంది.

జ‌మ్మూక‌శ్మీర్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయడానికి చాలా కాలంగా పాక్ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. జమ్ము ఎయిర్ పోర్టులో డ్రోన్ తో దాడి జ‌రిగిన అనంత‌రం భార‌త్ మ‌రింత అప్ర‌మ‌త్త‌మై డ్రోన్ల‌పై నిఘా పెంచింది. కీలక ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్య‌వ‌స్థ‌నూ ఏర్పాటు చేశారు.