Narendra Modi: 2013లో మోదీ లక్ష్యంగా బాంబు దాడుల కేసు.. 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు

NIA Court Convicted 9 In 2013 Hunkar Bomb Blast Case
  • వచ్చే నెల 1న శిక్ష ఖరారు
  • 2013 అక్టోబర్ 27న పాట్నాలో మోదీ హూంకార్ సభ
  • బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తొలి సభ
  • బాంబులు పేల్చిన తీవ్రవాదులు
  • ఆరుగురి మృతి.. 80 మందికిపైగా గాయాలు
నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్ 27న బీహార్ రాజధాని పాట్నాలో జరిపిన పేలుళ్ల ఘటన కేసులో తొమ్మిది మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. నాడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ.. పాట్నాలోని గాంధీ మైదాన్ లో ‘హూంకార్’ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే, బీజేపీ ప్రధాన నేతలు రావడానికి ముందు వేదిక వద్ద దుండగులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 80 మంది గాయపడ్డారు.

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి), ఇండియన్ ముజాహిదిన్ కు చెందిన 10 మందిపై ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. అందులో సరైన ఆధారాలు లేవన్న కారణంగా ఫక్రుద్దీన్ అనే నిందితుడిని కోర్టు విడుదల చేసింది. నుమాన్ అన్సారీ, హైదర్ అలీ అలియాస్ బ్లాక్ బ్యూటీ, మహ్మద్ ముజీబుల్లా అన్సారీ, ఒమర్ సిద్ధిఖీ, అజారుద్దీన్ ఖురేషీ, అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇఫ్తికార్ ఆలం, మహ్మద్ ఫిరోజ్ అస్లాం, మరో మైనర్ ను దోషులుగా తేల్చింది. తారిఖ్ అన్సారీ అనే మరో నిందితుడు పాట్నా జంక్షన్ లోని టాయిలెట్ లో బాంబు పెడుతుండగా అది పేలి చనిపోయాడు.

నిందితులకు వచ్చే నెల ఒకటిన కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, హూంకార్ ర్యాలీలో మొత్తం 17 ఐఈడీలను అమర్చగా.. అందులో ఏడింటిని పేల్చారు. దోషుల్లో ఎక్కువ మంది ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని సిథియోకు చెందిన వారే. ప్రస్తుతం వారంతా పాట్నాలోని బ్యూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. 2013 నవంబర్ 6 నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. మొత్తంగా 250 మంది సాక్షులను విచారించింది.
Narendra Modi
BJP
Bomb Blast
Hunkar Rally
Bihar
Patna

More Telugu News