తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు: విజయసాయిరెడ్డి ఆరోపణ

27-10-2021 Wed 19:43
  • డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ
  • ఢిల్లీలో విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు
  • ఆ అధికారిపై కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
  • ఆ పోలీసు అధికారి పేరు వెల్లడించని వైనం
Vijayasai Reddy alleges a Telangana Police Official colluded with Chandrababu
ఇటీవల డ్రగ్స్ అంశం తీవ్ర పరిణామాలకు దారితీసిన నేపథ్యంలో, టీడీపీ నేతలు, ఇతర విపక్ష నేతలు ఓ తెలంగాణ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తెలంగాణకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. ఆ అధికారి తెలంగాణ-ఏపీ సరిహద్దు జిల్లాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఆ పోలీసు అధికారి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తన మిత్రులైన ఇతర పోలీసు అధికారులకు ఏపీలోని అరకు లోయలో గంజాయికి సంబంధించిన దాడులు చేయాలంటూ సూచిస్తున్నాడని కూడా విజయసాయి ఆరోపించారు.

అయితే, ఆ పోలీసు అధికారి పేరును విజయసాయి వెల్లడించలేదు. అతడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.