టాలీవుడ్ బాట పట్టిన మరో కోలీవుడ్ హీరో!

27-10-2021 Wed 17:27
  • వంశీ పైడిపల్లితో విజయ్ మూవీ
  • శేఖర్ కమ్ములతో ధనుశ్
  • అనుదీప్ దర్శకుడిగా శివ కార్తికేయ
  • త్వరలోనే సెట్స్ పైకి
Shiva Karthikeyan in Anudeep movie
నిన్నమొన్నటివరకూ తమిళ హీరోలు తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేయడానికి పోటీ పడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తెలుగు దర్శకులతో ద్విభాషా చిత్రాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలను చకచకా కానిచ్చేస్తున్నారు.
 
హీరో విజయ్ .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే ధనుశ్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాకి నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఇక శివ కార్తికేయన్ కూడా 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రాజెక్టు ఖరారైపోయిందట. ఈ సినిమాను కూడా నారాయణ దాస్ నారంగ్ నిర్మించనుండటం విశేషం. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.