ఓ రైతును ఆదుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల

26-10-2021 Tue 16:31
  • ఈ నెల 21న సూర్యాపేట జిల్లా నేలమర్రిలో అగ్నిప్రమాదం
  • లక్ష్మయ్య అనే రైతు ఇల్లు దగ్ధం
  • బీరువాలో దాచిన రూ.6 లక్షలు కాలిపోయిన వైనం
  • రైతుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేసిన శేఖర్ కమ్ముల
Sekhar Kammula helps a farmer
ఇటీవల సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కప్పల లక్ష్మయ్య అనే రైతు ఇల్లు అగ్నికి ఆహుతైంది. బీరువాలో దాచుకున్న రూ.6 లక్షలు కూడా కాలిబూడిదయ్యాయి. పూరిల్లు కోల్పోవడం, దాచుకున్న డబ్బు మంటల్లో కాలిపోవడంతో రైతు లక్ష్మయ్య వేదన వర్ణనాతీతం.

ఆ రైతు పరిస్థితి గురించి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు తెలిసింది. ఆయన ఎంతో చలించిపోయారు. వెంటనే రైతు కుటుంబంతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అంతేకాదు, రైతు లక్ష్మయ్య ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేశారు. తమ దీనస్థితి పట్ల స్పందించడమే కాకుండా, లక్ష రూపాయలు పంపిన దర్శకుడు శేఖర్ కమ్ములకు రైతు లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.