Pattabhi: నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురయింది.. ఆమెను భయకంపితురాలిని చేశారు: పట్టాభి

My daughter became panic with YSRCP attacks says Pattabhi
  • ఇంటిపై జరిగిన దాడితో నా కూతురు షాక్ కు గురయింది
  • కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చాను
  • కుట్రపూరిత కేసులను కోర్టుల్లోనే తేల్చుకుంటా
తమ ఇంటిపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడితో తన కూతురు తీవ్ర మనోవేదనకు గురయిందని టీడీపీ నేత పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కుటుంబాన్ని తీసుకుని బయటకు వచ్చానని తెలిపారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని చెప్పారు. తన ఇంటిపై మూడోసారి దాడి చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

తాను ఇంట్లో లేని సమయంలో ఇంటిపై దాడి చేశారని... తన ఎనిమిదేళ్ల ఏకైక కుమార్తెను కూడా భయకంపితురాలిని చేశారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత అమానవీయమైన చర్య అని అన్నారు. పసి వయసులో హృదయాలకు గాయం తగిలితే దాన్ని పోగొట్టడం ఎంత కష్టమో అందరికీ తెలుసని చెప్పారు. మానవత్వం లేకుండా ప్రవర్తించి తన చిన్నారి కుమార్తెను షాక్ కు గురి చేశారని అన్నారు. మనోవేదనకు గురైన కుమార్తెను, భార్యను బయటకు తీసుకొస్తే దానికి కూడా విపరీతార్థాలు తీస్తున్నారని మండిపడ్డారు.  

తాను మాట్లాడిన మాటలకు లేని అర్థాలను సృష్టించారని పట్టాభి మండిపడ్డారు. అతి త్వరలోనే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. తనపై నమోదైన కేసులను కోర్టుల్లో తేల్చుకుంటానని అన్నారు. కుట్రపూరితమైన ఈ కేసులకు భయపడే పరిస్థితే లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు.

తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. తనకు అండగా నిలిచిన చంద్రబాబు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్, గంజాయి వల్ల యువత జీవితాలు నాశనం కాకూడదనే తాము ఈ ఉద్యమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలిపారు.
Pattabhi
Telugudesam
YSRCP
Attack
Video

More Telugu News