'ప్రగతి ఓఎస్'... జియో ఫోన్ నెక్ట్స్ లో వినియోగించే ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే!

25-10-2021 Mon 16:13
  • అత్యంత చవకగా స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్న జియో
  • దీపావళికి విడుదల కానున్న జియో ఫోన్ నెక్ట్స్
  • భారతీయత ఉట్టిపడేలా ఓఎస్ కు నామకరణం
  • కొత్త ఫోన్ లో క్వాల్ కామ్ ప్రాసెసర్
Jio phone next works on Pragathi OS
జియో ఫోన్ నెక్ట్స్ పేరిట అత్యంత చవకగా, ఆధునిక ఫీచర్లతో రిలయన్స్ సంస్థ ఓ స్మార్ట్ ఫోన్ తీసుకువస్తుండడం తెలిసిందే. విడుదలకు ముందే ఈ ఫోన్ భారత టెక్ వర్గాలతో పాటు, ప్రజల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. జియో ఫోన్ నెక్ట్స్ ఈ దీపావళికి విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఫోన్ కు సంబంధించిన ఓ విశేషం వెల్లడైంది.

తమ ఫోన్ లో వినియోగించే ఆపరేటింగ్ సిస్టమ్ కు జియో వర్గాలు 'ప్రగతి ఓఎస్' అని నామకరణం చేశాయి. తమ ఫోన్ ను వాడే ప్రతి ఒక్కరూ ప్రగతిపథంలో పయనించాలన్నదే తమ అభిమతమని ఓఎస్ కు 'ప్రగతి' అని పేరుపెట్టడం వెనుకగల కారణాన్ని జియో వెల్లడించింది. భారతీయత ఉట్టిపడేలా ఉన్న ప్రగతి ఓఎస్ పేరు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.

స్మార్ట్ ఫోన్ ఓఎస్ లలో ఆండ్రాయిడ్ కు వచ్చినంత సక్సెస్ మరే ఇతర ఓఎస్ కు రాలేదు. మరి ప్రగతి ఓఎస్ ఎలాంటి పనితీరు కనబరుస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. కాగా, జియో ఫోన్ నెక్ట్స్ లో వేగవంతమైన కార్యకలాపాల కోసం క్వాల్ కామ్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు.