Palla Rajeshwar Reddy: ఈటల, ఆయన భార్య సొమ్మసిల్లి పడిపోయే డ్రామా చేయబోతున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
- పోలింగ్ కు ముందు డ్రామాలు చేస్తారు
- ఈటల తానేదో స్వాతంత్ర్య సమరయోధుడు అయినట్టు ఊహించుకుంటున్నారు
- హుజూరాబాద్ కు ఏం చేశారో ఈటల చెప్పాలి
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... పోలింగ్ కు ముందు బీజేపీ నాయకులు ఎన్నికల డ్రామాలు కూడా చేస్తారని అన్నారు.
ఈ నెల 27న ఈటల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున సొమ్మసిల్లి పడిపోయే డ్రామా చేస్తారని చెప్పారు. ఆరోగ్యం బాగోలేని వారితో ఆత్మహత్యాయత్నం చేయించే అవకాశం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఈటల దంపతులు ఇలాంటి చిల్లర డ్రామాలకు తెరతీయబోతున్నారనే విశ్వసనీయ సమాచారం తమ వద్ద ఉందని అన్నారు.
బీజేపీ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. కయ్యానికి కాలుదువ్వుతున్నారని పల్లా మండిపడ్డారు. బీజేపీ తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ తానేదో స్వాతంత్ర్య సమరయోధుడయినట్టు ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆరు సార్లు గెలిచిన ఈటల నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల ఎన్ని డ్రామాలు చేసినా హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు.