నేను స్వయంగా వచ్చి ఓట్లు అడగాలని భావించా.. కానీ, కరోనా నిబంధనల కారణంగా రాలేకపోతున్నా: బద్వేలు ఓటర్లకు జగన్ లేఖ

25-10-2021 Mon 10:06
  • ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
  • ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నానని ఆవేదన
  • దాసరి సుధను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన
AP CM Jagan Writes letter to Badvel Voters
కర్నూలు జిల్లా బద్వేలు నియోజకవర్గ ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 30న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండగా వైసీపీ నుంచి దాసరి సుధ పోటీలో ఉన్నారు. ఆమెను తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారానికి రావాలని అనుకున్నానని, కానీ ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా రాలేకపోతున్నానని తెలిపారు.

తాను ప్రచారానికి వస్తే అక్కాచెల్లెమ్మలు ఒక్కసారిగా గుమికూడితే వారిలో ఏ కొందరైనా కరోనా బారినపడే అవకాశం ఉందని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రచారానికి రాలేకపోతున్నానంటూ పేరుపేరునా ముద్రించిన కర పత్రాలను స్థానిక నేతలు పంపిణీ చేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల్లో నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల వివరాలను కూడా అందులో పొందుపర్చారు.