బ్రిటన్ లో కరోనా కొత్త వేరియంట్.. డెల్టా కన్నా వేగంగా వ్యాప్తి

24-10-2021 Sun 14:56
  • డెల్టాలో మార్పులు జరిగాయన్న నిపుణులు
  • డెల్టా ప్లస్ గా పిలుస్తున్న వైనం
  • తీవ్రత ఎక్కువగా ఉండదని ఆశాభావం
Britain Sees Unusual Jump In Corona Cases As New Variant Emerges
బ్రిటన్ లో కరోనా మహమ్మారి మరోసారి తన కోరలను చాస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న డెల్టా వేరియంట్.. మరో వేరియంట్ గా మారింది. డెల్టా ప్లస్ (ఏవై 4.2)గా వ్యవహరిస్తున్న ఈ వేరియంట్ ను ‘పరిశీలనలో ఉన్న వేరియంట్’గా బ్రిటన్ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. డెల్టాను మించిన వేగంతో ఈ వేరియంట్ ప్రజలకు వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, డెల్టాతో పోలిస్తే ఈ డెల్టాప్లస్ తీవ్రత తక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరగడానికి కారణం మహమ్మారి వైరస్ లో మార్పులా? లేదంటే సంక్రమిత వ్యాధులకు అనువైన వాతావరణం ఏర్పడడమా? అన్న దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 6 శాతం దాకా ఈ కొత్త వేరియంట్ వేనని చెబుతున్నారు. ఈ నెల 20న వచ్చిన కేసుల్లో 15,120 కేసులు డెల్టా ప్లస్ వి ఉన్నాయంటున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాలోనూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ వేసుకున్న వారికే అన్ని ఆంక్షల నుంచి ఆ దేశం సడలింపులను ఇచ్చింది. టీకా వేసుకోని వారిపై ఆంక్షలను విధించింది. ఇటు రష్యాలో తాజా 37,678 కేసులు నమోదైతే.. 1,075 మంది బలయ్యారు. గత సెప్టెంబర్ తో పోలిస్తే ఇప్పుడు కేసులు 70 శాతం, మరణాలు 33 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ లోనూ 614 మంది చనిపోయారు.